Wednesday, April 29, 2009

ప్రతిస్పందన

నేను లెక్చరరుని కాదు, టీచర్ ని. నేను పాఠం చెప్పేటప్పుడు, రెండు, మూడు వారాలు అయిన తరువాత, విద్యార్ధులని అడుగుతాను, "చెప్పిన పాఠం అర్ధం అవుతోందా? జోరు తగ్గించాలా? ఇంకొంచెం జోరు పెంచొచ్చా?" వగైరా ప్రశ్నలు. లేకపోతే బధిరశంఖన్యాయంలా తయారవుతుంది పరిస్థితి.

ఇదే ధోరణిలో నాలుగు రోజుల క్రితం నా బ్లాగు చదివే పాఠకులని, "ఏమిటి మీ స్పందన?" అంటూ ఒక చిన్న ప్రశ్న అడిగేను. నేను నోరు విడచి అడిగినందుకు పన్నెండు మంది సమాధానం ఇచ్చేరు. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సమాధానాలని నాలుగు వర్గాలుగా విడగొట్టవచ్చు.
1. మీరు రాసింది బాగుంది. పదే పదే ఎందుకు చెప్పటం అని మేము స్పందించలేదు.
2. మీకు ఒకరి స్పందనతో పనేమిటీ? మీరు ఒకరి మన్నన పొందటానికి రాయటం లేదు కదా!
3. కొంచెం స్థాయి తగ్గించి రాయండి, లేకపోతే నాకు అర్ధం కావటం లేదు.
4. ఆ తెలుగు మాటల వాడకం ఆపి ఇంగ్లీషు మాటలే వాడెయ్యండి, అందరికీ సులభంగా అర్ధం అవుతుంది.

నేను విద్యార్ధిగా ఉన్న రోజులలో, మొదటిసారి పరిశోధనా పత్రం రాసి ప్రచురణకి పంపినప్పుడు, సంప్రదాయానుసారంగా, ఆ పత్రికా సంపాదకుడు నేను రాసిన పత్రం మరో నలుగురికి పంపి వాళ్ళ అభిప్రాయాలు అడిగి, ఆ అభిప్రాయాలు సేకరించి నాకు తిరిగి పంపి, నా పత్రాన్ని తదనుగుణంగా సవరించి పంపమన్నాడు. అందులో మూడు అభిప్రాయాలు, "ఈ పరిశోధనా పత్రం బాగానే ఉంది. ప్రచురణార్హమే!" అని వచ్చేయి. నాలుగోది మాత్రం నన్ను ఏకెస్తూ వచ్చింది. నా గురువుగారు నాలుగూ చదివి, మొదటి మూడూ మనకి పనికిరానివి, అవి పక్కన పెట్టెయ్; ఆ నాలుగోది ఘాటుగా ఉందని ఉడుక్కోకు, అదే మనకి ఉపయోగపడుతుంది. ఆ నాలుగో అభిప్రాయం చదివి అందులో ఉన్న ఆక్షేపణలన్నిటిని మనస్పూర్తిగా స్వీకరించి, నా పత్రాన్ని మరమ్మత్తు చెయ్యమని చెప్పి, నాతో అన్నారు: "మన పనిని అక్షేపించినవాడే మన అసలు స్నేహితుడు. ఇది జ్ఞాపకం పెట్టుకో!"

కనుక పైన ఉన్న నాలుగు వర్గాలలోనూ నాకు కావలసినవి ఆఖరి రెండు అభిప్రాయాలూను. నేను రాసేదాని స్థాయి ఎక్కువగా ఉంది, అర్ధం చేసుకోవటం కష్టంగా ఉంది అంటే, మరికొంచెం శ్రమ పడి చూస్తాను. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకొండి. ఇది పాఠ్యపుస్తకం (text book) కాదు. జనరంజకమైన శైలిలో స్థాయి తగ్గించి రాసినప్పుడు స్పష్టత కోసం ఖచ్చితత్వం (accuracy) కొంత త్యాగం చెయ్యవలసి వస్తుంది. మరొక విషయం. చదివినది అంతా, చదివిన వెంటనే అర్ధం అవక్కరలేదు. సైన్సు పులుసు లాంటిది. మరిగిన కొద్దీ పులుసుకి రుచి ఎలా వస్తుందో అలాగే చదివినదే మళ్ళా మళ్ళా చదివితే మరికొంచెం బాగా అర్ధం అవుతుంది. అందుకనే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళకి చెప్పిన పాఠమే మళ్ళా మళ్ళా చెప్పినట్లు ఉండదు. ప్రతి సారీ పాత పాఠమే మరొక కొత్త అనుభూతిని ఇస్తుంది.

రెండవ ఆక్షేపణ. ఇంగ్లీషు మాటలు వాడేసి రాసేస్తే సులభంగా అర్ధం అయిపోతుందనే భావన. ఈ బ్లాగు రాయటానికి ప్రేరణ కారణం వీలయినంత వరకు తెలుగు మాటలు వాడి తెలుగులో సైన్సు చెప్పగలమని, రాయగలమని నిరూపించటం. మరొక విధంగా చెప్పాలంటే తెలుగులో సైన్సు రాస్తే ఎలాగుంటుందో ప్రయత్నించి చూడాలనే తపన ఈ కార్యక్రమానికి మూల కారణం. ఇప్పుడు నేను అన్నీ ఇంగ్లీషు మాటలు వాడేసి రాసేస్తే నా వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు. కనుక ఇలా రాయాలనే రాస్తున్నాను. కాని అందరికీ అర్ధం అవాలన్న ఆకాంక్షతో నేను వాడిన ప్రతి తెలుగు మాటకి పక్కనే ఆ మాటని ఇంగ్లీషులో ఏమంటారో కూడ రాసి చూపిస్తున్నాను కదా. నేను ఇంగ్లీషుని మానేయమనటం లేదు. నేను మానెయ్యమన్నా మన తెలుగువారు మానరు, మానలేరు. తెలుగులో రాసి చూపిస్తున్నాను, అంతే. ఈ ప్రయోగం సఫలం అవాలంటే చదువరులు కూడ కొంచెం ఓపిక పట్టాలి - అలవాటు లేని పని కనుక.

రసాయనశాస్త్రం అంటే చాలమందికి ఇష్టం ఉండదు. అర్ధం అవదు, కష్టంగా ఉంది అంటారు. ఒడుపు తెలిస్తే రసాయనశాస్త్రం చాల తేలిక అని నా అభిప్రాయం. ఈ శాస్త్రం చదువుతూన్నప్పుడు నేను పొందే అనుభూతి ఎలాంటిదో మీకు కూడ రుచి చూపించాలనే తాపత్రయంతో రాస్తున్నాను. "సీరియస్" గా తీసుకోకుండా "కేషువల్" గా చదవండి. అదే అర్ధం అవుతుంది.

Sunday, April 19, 2009

ఇంటింటి రసాయనం, వంటింటి రసాయనం - 7

III ఉదకర్బనాలలో జంట, త్రిపుట బంధాలు

ప్రకృతి వర్ణాలు, కేరట్లు, టొమేటోలు

అసంతృప్త ఉదకర్బనాల జాతికి చెందినదే ఐసోప్రీను (isoprene) అనే మరొక పదార్ధం. దీని పేరులో “ఐసో” అనే మాట ఉంది కనుక దీని నిర్మాణక్రమంలో గొలుసులో కౌస్థుభమణిలా వేల్లాడే అణువుల గుంపొకటి ఉండాలి. ఈ దిగువ చూపించిన నిర్మాణక్రమంలో -CH3 గుంపు అటువంటిదే.









బొమ్మ. ఐసోప్రీను నిర్మాణక్రమం.

ఈ నిర్మాణక్రమంలో గమనించవలసినది ఏకాంతర (alternate) స్థానాలలో ఉన్న జంట బంధాలు. ఇలా ఏకాంతర స్థానాలలో ఉన్న జంట బంధాలని సంయోగ (conjugate) జంట బంధాలు అంటారు. ఇలా సంయోగ జంట బంధాలు ఉన్న పదార్ధాలకి నిశ్చలత (stability) ఎక్కువ. ప్రకృతి సిద్ధంగా లభించే పదార్ధాలలో (natural products) ఈ రకం జంట బంధాలు తరచు కనిపిస్తూ ఉంటాయి.

ఎతీను (లేదా, పాతపేరయిన ఎతిలీను) బణువులని “దండించి” నట్లే ఈ ఐసోప్రీను బణువులని పొడుగాటి దండలుగా చెయ్యవచ్చు. ఇలాంటి ఐసోప్రీను బణువుల దండలని టెర్పీనులు (terpenes) అంటారు. ఈ “టెర్పీను” అన్న పేరు ఎక్కడనుండి వచ్చింది? ఈ రకం ఐసోప్రీను దండలు టర్పెంటైన్ (terpentine) అనే పదార్ధంలో ముందుగా కనిపించేయి. కనుక ఈ రకం దండలన్నింటినీ, (టర్పెంటైన్‌తో సంబంధం ఉన్నా లేకపోయినా) టెర్పీనులు అనటం మొదలు పెట్టేరు. టర్పెంటైన్ మనకి తెలియని పదార్ధం ఏమీ కాదు. గోడలకి పూసే పెయింటు, కర్రసామానులకి పూసే వార్నిష్ లు (paints and varnishes) ఈ టర్పెంటైన్ కలిపితే పలచబడతాయి. ఈ టర్పెంటైన్ శీతలదేశాలలో పెరిగే దేవదారు (pine) జాతి చెట్ల నుండి స్రవించే రసంతో చేస్తారు. మధ్యధరా ప్రాంతాలలో పెరిగే ఈ రకం చెట్టు పేరు Pistacia terebinthus. ఈ పేరు లోంచి terpentine అన్న మాట వచ్చింది. దీనిని తెలుగులో – నేనేమీ ఈ పేరు పెట్టటం లేదండోయ్ - “శ్రీవేష్టం” అంటారు. ఇంగ్లీషు మోజులో పడ్డ తెలుగువాళ్ళకి ఈ పేరు తెలియకపోవచ్చు, ఒకవేళ తెలిసినా తెలుగుమాట వాడటానికి చిన్నతనంగా ఉండొచ్చు. వారు టర్పెంటైన్ అని అనెయ్యవచ్చు.

ఈ టెర్పీను జాతి దండలలోకల్లా ముఖ్యమైన ఒక దండ పేరు కేరొటీన్ (carotene). ఇక్కడ “క” కి ఏత్వం మీద పొల్లు, “టి” కి దీర్ఘం తీసి ఉచ్చరించాలి; లేకపోతే మరొక పదార్ధం స్పురిస్తుంది. శాస్త్రం కూడా వేదం లాంటిదే. వర్ణక్రమదోషం ఉన్నా, ఉచ్చారణ దోషం ఉన్నా చిక్కులు వచ్చి పడతాయి. కేరట్ జాతి కాయగూరలలోను, దుంపలలోనూ ఇది విస్తారంగా దొరుకుతుంది కనుక దీనికి “కేరొటీన్” అని పేరు పెట్టేరు. కేరట్లలోనే కాదు, పసుపు డౌలు గల కాయగూరలలో చాల వాటిల్లో ఇది ఉంటుంది. చిలగడ దుంపలు మొదలైన పదార్ధాల పచ్చ రంగుకి ఈ కేరొటీన్ కారకురాలు. కేరోటీన్ సాంఖ్య క్రమం C40Hx. దీనిని జంతువులు తయారు చెయ్యలేవు. కనుక కేరొటీన్ కావాలనుకుంటే కాయగూరలు తినాలి. ఈ కేరొటీన్ కొవ్వు పదార్ధాలలో కరుగుతుంది. కనుక కేరొటీన్ ఒంటబట్టాలంటే కాయగూరలని ఉడకబెట్టి కొద్దిగా నూనెతో తాలింపు పెడితే మంచిది. ఎందుకీ డొంకతిరుగుడు సైంటిఫిక్ కూతలు? కూర ఒండుకుని, తాలింపు పెట్టి తినమంటున్నారు.

ఈ కేరొటీన్ ఉనికిని మన తెలుగువాడు ఎవ్వడైనా ముందుగా కనుక్కుని ఉండుంటే దీనికి ఏ "ముల్లంగీను" అనో “చిలగడీను” అనో పేరు పెట్టి ఉండేవాడేమో! కాక, తెలుగువాడు కనుక, తెలుగు పేరు తప్పించి మరో భాషలో పేరు పెట్టినా పెట్టగల సమర్ధుడు.

ఈ కేరొటీన్ అసలు రంగు ఎరుపు (red). దీని మోతాదు కొద్దిగా ఉంటే నారింజ రంగులో కనిపిస్తుంది. మరికొంచెం ఎక్కువగా ఉంటే పచ్చరంగుని ఇస్తుంది. ఈ కేరొటీన్ కరిగిన కొవ్వు చర్మం అడుగున ఉంటే ఆ మనుష్యులు పచ్చగా కనబడతారు. మన పెళ్ళి కూతుళ్ళు (పెళ్ళికొడుకులు కూడా) పెళ్ళి చూపుల ముందు కొన్నాళ్ళు కేరట్లు తింటే శరీరం కొంచెం పచ్చబడి, పెళ్ళిళ్ళు త్వరగా జరగటమో, కట్నం కొంత తగ్గటమో జరగొచ్చని ఆ మధ్య ఒక మహానుభావుడు ఒక సిద్ధాంతం లేవదీశాడు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాని, చైనా, జపాను వంటి దేశాలలో ప్రజలు గీసేసిన కందగడ్డలా ఎర్రగా ఉండకుండా, గీసేసిన చిలగడ దుంపలలా పసుపు డౌలు కలిగి ఉండటానికి ఈ కేరొటీన్ కారణం.

టొమేటో (ఇండియాలో టమాటా అంటారుట) లకి ఎర్ర రంగు రాటానికి కారణం కేరొటీన్ వంటి మరొక పదార్ధం. దీని పేరు లైకొపీన్ (lycopene). లేటిన్ భాషలో ఈ మాట టొమేటోలని సూచిస్తుంది. హోమియోపతీ వైద్యం పరిచయమైనవారికి “లైకోపోడియం” అనే మందు పేరు పరిచయమే. ఈ లైకోపోడియం టొమేటోలనుండి తయారుచెయ్యవచ్చన్న మాట. ఈ కేరోటీన్ లో ఒక ఉపజాతి అయిన “బీటా కేరోటీన్” మన ఆహారంలో ఉంటే కేన్సరు వ్యాధి రాకుండా అరికడుతుందని అంటున్నారు.

రబ్బరు కథ

ఉష్ణమండలాలలో పెరిగే కొన్ని మొక్కల ఆకులు చిదిమితే పాలు కారుస్తాయి. గన్నేరు ఈ రకం మొక్కే. పనసని కూడ ఇందులో చేర్చవచ్చేమో. ఇలా పాలు కార్చే చెట్లలో హీవియా (Hevia brasiliensis) ఒకటి. దీనినే రబ్బరు చెట్టు (rubber tree) అని కూడ అంటారు. ఈ రబ్బరు చెట్టు దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో, అమెజాన్ అరణ్యాలలో పెరుగుతుంది. దీనిని దరిమిలా ఆగ్నేయ ఆసియాలో కూడ పెంచటం మొదలుపెట్టేరు. ఈ రకం చెట్లు ఇచ్చే పాలని ఇంగ్లీషులో లేటెక్స్ (latex) అంటారు. పాలల్లో వెన్నపూస ఎలా వేల్లాడుతూ (అంటే, suspend అయి) ఉంటుందో అలాగే ఈ లేటెక్సులో కూడ ఒక రకం “వెన్న” విలంబితమై ఉంటుంది. ఇలా లేటెక్స్ లో విలంబితమయిన “వెన్న” దండించబడ్డ ఐసోప్రీను బణువుల ముద్ద తప్ప మరేమీ కాదు. పాలని చిలికి వెన్న తీసినట్లో, లేక పాలని విరగ్గొట్టి జున్ను తీసినట్లో లేటెక్స్ నుండి ఈ ఐసోప్రీను బణువుల ముద్దని వెలికి తియ్యవచ్చు. ఇలా తీసిన ముద్దని పెనిసిల్ తో రాసిన అక్షరాల మీద పులిమితే ఆ అక్షరాలు చెరిగిపోతాయి. అందుకని మొదట్లో ఈ ముద్దని ఉండలుగా చేసి పెనిసిలు రాతని చెరపటానికి వాడేవారు. అప్పట్లో ఈ ముద్దకి పేరేమీ లేదు. కనుక కచేరీలో కాగితాల మీద రాత చెరపవలసి వచ్చినప్పుడల్లా “ఆ పులిమేది ఇలా పట్రా!” అనేవారు. ఈ మాటేదో తెలుగులో కాక ఇంగ్లీషులో అనేవారు. ఇంగ్లీషులో ఈ వాక్యం, bring that rubber అవుతుంది. ఈ “రబ్బరు” ని ఇచ్చే చెట్టు కనుక ఆ చెట్టుని కూడా “రబ్బరు చెట్టు” అనే అన్నారు. ఇదంతా బ్రిటిష్ వాడి పెత్తనం ఉన్న రోజుల్లో జరిగిపోయింది కనుక మనకి ఈ “రబ్బరు” అనే పేరు మిగిలింది. ఈ అమెరికా వాడి పెత్తనం వచ్చేసి ఉంటే అది “ఇరేజరు” చెట్టు (eraser tree) అయి కూర్చునేది.

ఇలా లేటెక్స్ పాల నుండి వచ్చిన “పచ్చి” రబ్బరు ని తెలుగులో “కచ్చా” రబ్బరు అనిన్నీ, ఇంగ్లీషులో raw rubber అనిన్నీ, అప్పుడప్పుడు India rubber అనిన్నీ అంటారు. ఇక్కడ “ఇండియా” కీ మన పవిత్ర భారత దేశానికీ మధ్య ఉన్న సంబంధం కేవలం బాదరాయణ సంబంధం మాత్రమే. ఇక్కడ “ఇండియా” అంటే “వెస్ట్ ఇండీస్ (West Indies, క్రికెట్ ఆటలో ప్రసిద్ధికెక్కినవి) దీవులని ఉద్దేసించి అన్న మాట.

బాగా వేడిగా ఉన్న రోజులలో ఈ కచ్చా రబ్బరు పనస బంకలా సాగుతూ చేతికి అంటుకుని ఒదలదు. బాగా చల్లగా ఉన్న రోజున ఎండిపోయిన తుమ్మ బంకలా పెళుసుగా తయారవుతుంది. మామూలు రోజులలో మాత్రం, అంటే కాలం, కర్మం కలిసొచ్చిన వాతావరణంలో, ఈ రబ్బరు తో బంతిని చేస్తే అది బంతిలా కిందపడ్డప్పుడల్లా రివ్వున పైకి లేస్తుంది.

సా. శ. 1838 లో అమెరికాలో చారెల్స్ గుడియర్ (Charles Goodyear) అనే ఆసామీ ఈ రబ్బరుని ఏవేవో ప్రయోగాలు పేరిట వేడి చేసి, చల్లార్చి చూస్తున్నాడు. వంటింట్లో విజృంభించిన బెర్జీలియస్ శిష్యగణం జ్ఞాపకం లేదూ, అలాగన్న మాట. ప్రమాద వశాత్తూ పక్కనున్న గిన్నెలో ఉన్న గంధకం (sulfur) ఒలికి కరుగుతున్న రబ్బరులో పడింది. (రొట్టె విరిగి నేతిలో పడటం అంటే ఇదే!) గత్యంతరం లేక, జరిగిన పొరపాటుకి తనని తానే తిట్టుకుంటూ, మరుగుతూన్న రబ్బరుని కిందకి దించి చల్లార్చేడు. ఇంకేముంది. రబ్బరుకి పెళుసుతనం పోయింది! జిగటతనం పోయింది! సాగదీస్తే సాగుతోంది. ఒదిలేస్తే తిరిగి యధాస్థితికి వస్తోంది. పుట్టుకతో వచ్చిన అవలక్షణాలన్నీ పోయి మంచి మంచి లక్షణాలు వచ్చేయి. అప్పటినుండి జున్నులో మిరియపు గింజ వేసినట్లు రబ్బరులో కాసింత గంధకం వేసి మరిగించటం ఆనవాయితీ అయిపోయింది. ఇలా గంధకంతో మరమ్మత్తు కాబడిన రబ్బరుని వల్కనైజ్డ్ రబ్బరు (vulcanized rubber) అంటారు. రోమనుల పురాణాలలో అగ్నికి, అగ్ని పర్వతాలకి అధిపతి వల్కన్ (Vulcan).

ఇలా వల్కనీకరణ రహశ్యం తెలిసిన తరువాత రబ్బరు ఆధునిక సమాజంలో సర్వాంతర్యామి అయిపోయింది. సైకిళ్ళకి, కార్లకి, విమానాలకి, ఆఖరికి ఎద్దుబళ్ళకి కూడ రబ్బరు చక్రం కాని రబ్బరు తొడుగు కాని లేకపోతే రోజు గడవదు కదా. ఈ మధ్య ప్లేస్టిక్కులు వచ్చే వరకు విద్యుత్ పరిశ్రమలో రబ్బరు అత్యవసరమయిపోయింది. ఈ రబ్బరు మీద మనం ఎంతలా ఆధారపడిపోయామంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికాలో మొట్టమొదట రేషనింగు పెట్టినది తిండి పదార్ధాలకి కాదు, పెట్రోలు, కిరసనాయిలు వంటి ఇంధనపు చముర్లకి కాదు – రబ్బరు టైర్లకి!!

యుద్దపు రోజుల్లో ఈ రబ్బరుకి ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే రణరంగంలో సైనికుల పోరాటం ఒక ఎత్తు, వారి వెనక ఉండి వారికి కావలసిన రబ్బరు సామగ్రిని సరఫరా చెయ్యటానికి రసాయన శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో జరిపిన పోరాటం మరొక ఎత్తు! యుద్ధం ప్రళయంలా విరుచుకు పడే వేళకి రబ్బరుని పెంచే ముఖ్యమయిన దేశాలు (అంటే, మలయా, ఇండోనేసియా, మొదలైనవి) ఒక పక్షం వశం అయిపోవటంతో రెండవ పక్షం వారికి రబ్బరు సరఫరా తగ్గిపోయింది. అప్పుడు రసాయన నిష్ణాతులు కృత్రిమంగా రబ్బరుని తయారు చెయ్యటానికి జరిపిన పోరాటం ముందు రణరంగపు ఫిరంగి పేల్పులు దివిటీల ముంది దివ్వెలా వెలవెల పోయాయంటే అది అతిశయోక్తి కాదు.

ఇంత ముఖ్యమయిన వల్కనీకరణాన్ని కనిపెట్టిన గుడియర్ కోటికి పడగలెత్తేసి ఉండాల్సింది. అన్నీ బాగానే ఉన్నాయి కాని అల్లుడి నోట్లోనే శని అన్నట్లు గుడియర్ గ్రహచారం వక్ర గతి పట్టింది. జీవితమంతా అప్పులపాలయిన ఈ అప్పారావు రబ్బరు మీద చేసిన పరిశోధనలన్నీ అప్పులాళ్ళ బందిఖానాలో! తర్వాత ఈ వల్కనీకరణాన్ని పేటెంటు చేసే సందర్భంలో వచ్చిన లావాదేవీలలో, వకీళ్ళ ధర్మమా అని, గుడియర్ బికారివాడయిపోయాడు. సా. శ. 1860లో అరవై లక్షల అప్పుతో (రూపాయల్లోకి మార్చేను లెండి) హరీమనిపోయాడు. చచ్చిపోయాడు కనుక బతికిపోయాడు కానీ బతికుంటే అప్పులాళ్ళు చంపేసి ఉండేవారు.

రబ్బరు అంటే ఐసోప్రీను బణువుల తోరణం లాంటిదని తెలిసిన తరువాత రబ్బరుని కృత్రిమంగా సృష్టించటంలో కష్టం ఏముందన్న సందేహం కొంతమందికి రావచ్చు. వచ్చిన చిక్కల్లా ఐసోప్రీను బణువులని ప్రయోగశాలలో సంధిస్తే తుమ్మ బంక లాంటి పెళుసయిన పదార్ధం వచ్చేది కాని రబ్బరు లాంటి స్థితిస్థాపకత (elasticity) ఉన్న పదార్ధం వచ్చేది కాదు. అంతేకాకుండా ఈ సంధానానికి కావలసిన ముడి పదార్ధం ఐసోప్రీను. ఈ ఐసోప్రీను తయారీకి కావలసిన ముడిపదార్ధం రబ్బరు పాలు! పిచ్చి కుదిరింది, తలకి రోకలి చుట్టమన్నట్లు లేదూ? ఈ చిక్కులోంచి బయట పడటానికి జెర్మనీ దేశపు రసాయనుడు ఐసోప్రీనుకి స్వస్తి చెప్పేసి అలాంటిదే మరొక పదార్ధం వాడి రబ్బరు పండించే దేశాల ఏకాధిపత్యానికి శృంగభంగం చెయ్యమన్నాడు. ఈ ముడి పదార్ధం పేరు బ్యూటడీన్. ఈ బ్యూటడీన్ ని బ్యుటేను నుండి తయారు చెయ్యవచ్చు. ఈ చతుర్ధేను (లేదా బ్యుటేను) రాతిచమురు నుండి కాని, రాక్షసి బొగ్గు నుండి కాని వస్తుంది. బొగ్గు నుండి రబ్బరా? ఇది బొగ్గు కాదు, నల్ల బంగారం!

బ్యూటడీన్‌కీ ఐసోప్రీనుకీ ఒకే ఒక చిన్న తేడా ఉంది. ఐసొప్రీనులో కౌస్థుభమణిలా వేల్లాడుతూ ఉండే -CH3 ని తీసేసి దాని స్థానంలో సాదా, సీదా ఉదజని అణువుని వేస్తే మనకి మిగిలేదే బ్యుటడీను. ఈ తేడా తెలియాలంటే ఇందాకా పరిచయం చేసిన ఐసోప్రీను నిర్మాణక్రమంతో ఈ దిగువ చూపిన బ్యుటాడీను నిర్మాణక్రమాన్ని పోల్చి చూడండి.







బొమ్మ. బ్యూటడీను నిర్మాణక్రమం.

ఈ బ్యూటడినుని తయారు చెయ్యటానికి ముడిపదార్ధంగా చతుర్ధేను (బ్యుటేను) అయినా పనికొస్తుంది, ఎసిటిలీను (acetylene) అయినా పనికొస్తుంది. ఈ ఎసిటిలీను ఒక్క కృత్రిమ రబ్బరు తయారీకే కాక మరెన్నో రసాయనాలకి ముడి పదార్ధంగా ఉపయోగపడుతూంది కనుక ఇప్పుడు ఎసిటిలీను గురించి అధ్యయనం చేద్దాం.

త్రిపుట బంధాలు, ఎసిటిలీను, పేలుడు పదార్ధాలు


రెండు కర్బనపు అణువుల మధ్య ఒకే ఒక బంధం ఉన్న "-ఏను" పదార్ధాల గురించి, జంట బంధాలు ఉన్న "-ఈను" పదార్ధాల గురించీ కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు త్రిపుట బంధాలు (triple bonds) ఉన్న "-ఐను" పదార్ధాల గురించి తెలుసుకుందాం. ఏక బంధాల వారి కంటె జంట బంధాల వారు ఎక్కువ చలాకీగా ఉంటారని అనుకున్నాం కదా. అదే ధోరణిలో రెండు కర్బనపు అణువుల మధ్య మూడు బంధాలు ఉన్న పదార్ధాలు ఇంకా చలాకీగా ఉంటాయి. ఒక కర్బనం పొరుగున ఉన్న మరొక కర్బనాన్ని మూడు చేతులతో పట్టుకున్న యెడల, ఇక ఖాళీగా ఉండే చెయ్యి ఒక్కటే. ఈ ఖాళీ చేతికి ఉదజని అణువుని తగిలిస్తే ఎలా ఉంటుందో ఈ దిగువ బొమ్మలో చూపుతున్నాను. ఇదే ఎసిటిలీను (acetylene) నిర్మాణక్రమం.








బొమ్మ. ఎసిటిలీను నిర్మాణక్రమం.


ఈ ఎసిటిలీను అనే పేరు జినీవా ఒప్పందానికి ముందే స్థిరపడిపోయిన పేరు. జినీవా ఒప్పందం ప్రకారం దీన్ని "ఎతైన్" (ethyne) అనాలి. మన తెలుగు పద్ధతిలో విదైను అనాలి. కాని ఇప్పటికీ - చాదస్తులు తప్ప - సామాన్యులు దీన్ని ఎసిటిలీను అనే అంటున్నారు. అలవాట్లని మార్చటం ఎంత కష్టమో కదా! చూడండి, మన తెలుగు వాళ్ళని తెలుగులో మాట్లాడమంటే ఎంత ఇబ్బంది పడిపోతారో!

ఎసిటిలీనులో రెండు నాలుగులు, వెరసి ఎనిమిది, ఉదజని అణువులు పట్టటానికి సరిపడా చోటు ఉంది, కాని రెండే రెండు ఉదజని అణువులు ఉన్నాయి. అంటే ఇది ఎతిలీను కంటె కూడ ఎక్కువ అసంతృప్త స్థితిలో ఉంది. ఇలా అసంతృప్త స్థితిలో ఉన్న బణువులు ఆకలితో ఉన్న సింహాల లాంటివి. అవకాశం దొరికితే మరేదయినా అణువుని కబళించేసి ఆకలి తీర్చుకుంటాయి. అందుకనే ఎసిటిలీను (లేదా ఎతైను) చాలా చురుకైన పదార్ధం.

మరొక సారూప్యం చెబుతాను. త్రిపుట బంధాలు ఉన్న పదార్ధాలు అవిభక్త కుటుంబాలలో ఉన్న కోడళ్ళలాంటివి. కలిసి ఉన్న కోడలు ఎప్పుడు విడిపోదామా అని చూస్తూ ఉంటుంది. పరిస్థితి ఎప్పుడూ బిర్రుగా ఉంటుంది. అదే విధంగా ఎసిటిలీనుకి నిప్పు రవ్వ తగిలేసరికి, ఎక్కుపెట్టిన బాణంలో నారి నుండి దూసుకు వచ్చిన బాణంలా, త్రిపుట బంధాలలో ఉన్న శక్తి అంతా ఒక్కసారి విడుదల అవుతుంది. అందుకనే ఎసిటిలీను జ్వాల చాల వేడిగా ఉంటుంది. ఇంత వేడిగా ఉన్న మంట మీద వంట చెయ్యటం కష్టం. ఎసిటిలీను మంట వేడికి వంట గిన్నెలు కరిగిపోయే ప్రమాదం ఉంది. (మామూలు కర్రల పొయ్యి మీద సత్తు గిన్నె కరిగిపోయినట్లు!) ఆ మాటకొస్తే లోహాలని కొయ్యటానికి ఎసిటిలీను జ్వాలని ఉపయోగిస్తారు. ఈ ఎసిటిలీనుని ఆమ్లజనితో కలిపి మండిస్తే ఆ మంట ఇంకా వేడిగా ఉంటుంది. ఈ మంట వేడికి ఇనుము, ఉక్కు కూడ వెన్నలా కరిగిపోతాయి. ఈ రకం మంటని సృష్టించే పరికరాన్ని "ఆక్సీఎసిటిలీన్ టార్చ్" (oxyacetylene torch) అంటారు. దీనిని "ఆమ్లవిదీను దివిటీ" అని తెలుగులో అనొచ్చు. భారీ ఎత్తు ఉక్కు కట్టడాలు కట్టే చోట పనివారు ఈ రకం దివిటీలని వాడటం చేసే ఉంటారు.

త్రిపుట బంధాలు ఉన్న పదార్ధాలలో అంతర్గతంగా అణచిపెట్టబడి ఉన్న శక్తి ఎంత ఉందో మరొక విధంగా చెబుతాను. త్రిపుట బంధాలు ఉన్న పదార్ధాలు చాలమట్టుకి పేలతాయి. ఎసిటిలీను బణువులో ఉన్న ఒక ఉదజని స్థానంలో వెండి కాని, రాగి కాని ఉంటే ఆ పదార్ధం ఇంకా దుమాగా పేలుతుంది. మెతేను వంటి వంట వాయువులని రగల్చాలంటే చిన్న అగ్గిపుల్ల వెయ్యాలి. కాని ఈ లోహపు ఎసిటైడు (metal acetides) లని పేల్చటానికి అగ్గిపుల్ల కూడ అవసరం లేదు. ఏ చిన్న చిన్న కుదుపు తగిలినా "ఢాం" అని పేలతాయి.

పేలే లక్షణం అస్సలు లేని ఒక లోహపు ఎసిటైడు ఉండటం ఉంది. దాని పేరు కేల్సియం కార్బైడు (calcium carbide). దీన్ని తెలుగు పాఠ్య పుస్తకాలలో "ఖటిక కర్బనిదము" అని రాయగా చూసేను. దీనిని గనులలో తవ్వి తియ్యవచ్చు, లేదా సున్నాన్ని, బొగ్గునీ కలిపి ఆవంలో వేసి కాల్చినా వస్తుంది. ఈ ఖటిక కర్బనిదానికి నీళ్ళు తగిలితే చాలు "బుస బుస" మంటూ ఎసిటిలీను బయటకి వస్తుంది. (ఈ సంగతి కనిపెట్టినది మరెవరో కాదు; మన బెర్జీలియస్ శిష్యుడు ఓలరు!). రసాయన పరిభాషలో ఈ ప్రక్రియని ఇలా రాస్తారు:

CaC2 + 2H2O → C2H2 + Ca(OH)2

విద్యుత్ దీపాలు, బేటరీలు వాడుకలోకి రాక పూర్వం ఎసిటిలీనుని ఈ విధంగా సృష్టించి, దానిని మండించి, ఆ మంటని కార్లకి శిరోదీపాలు లేదా తలదీపాలు (headlamps) గా వాడేవారు. సున్నాన్ని ఇంగ్లీషులో లైం (lime) అంటారు. సున్నం ద్వారా వచ్చే వాయువుతో వెలిగే దీపాలు కనుక వీటిని "లైం లైట్" (limelight) అనేవారు ఇంగ్లీషులో. నా చిన్నతనంలో "వాడు లైం లైట్ లో షైన్ అయిపోతున్నాడురా" అనే పదబంధం వినేవాడిని. వీటిని తెలుగులో "సున్నపు దీపాలు" అనొచ్చు కానీ ఈ పద ప్రయోగం మరీ "సున్నప్పిడత" లా ఉంటుందో ఏమో!


కృతజ్ఞత: ఈ వ్యాసంలో బొమ్మలు వేసినది ప్రసాదం,
బ్లాగే స్థలం: http://prasadm.wordpress.com/
నేను బ్లాగే మరో స్థలం: http://latebloomer-usa.blogspot.com

Saturday, April 18, 2009

ఇంటింటి రసాయనం, వంటింటి రసాయనం - 6

III ఉదకర్బనాలలో జంట, త్రిపుట బంధాలు

ఇంతవరకు కర్బనపు గొలుసులలో కర్బనపు అణువుల మధ్య ఒకే ఒక బంధం ఉన్నవాటినే పరిశీలించేం. ఇప్పుడు ఈ నిబంధనని సడలించి కర్బనపు అణువుల మధ్య రెండు కాని, మూడు కాని బంధాలు ఉన్న పదార్ధాలని పరిశీలిద్దాం.

మచ్చుకి, ఒక కర్బనం అణువు తన పక్కనున్న మరొక కర్బనం అణువు యొక్క చేతులలో రెండింటిని తన చేతులలో రెండింటితో పట్టుకుందనుకుందాం. అప్పుడు ఒకొక్క కర్బనానికి రెండేసి చేతులు చొప్పున నాలుగు ఖాళీ చేతులు మిగులుతాయి కదా. ఈ నాలుగు చేతులకి నాలుగు ఉదజని అణువులని తగిలిద్దాం. ఇలా వచ్చిన పదార్ధం సాంఖ్యక్రమం C2H4. ఈ రసాయనం పేరు ఎతిలీను. దీని నిర్మాణక్రమం ఈ దిగువ బొమ్మ 1 చ. లో చూపుతున్నాను.







బొమ్మ 1 క. గత అధ్యాయంలో చూపిన ఎతేను నిర్మాణక్రమం.








బొమ్మ 1 చ. ఇక్కడ ప్రస్తావిస్తూన్న ఎతిలీను నిర్మాణక్రమం.

గతంలో పరిచయమైన ఎతేను (ethane) సాంఖ్యక్రమం C2H6, ఇక్కడ ప్రస్తావిస్తూన్న ఎతిలీను సాంఖ్యక్రమం C2H4. వీటి నిర్మాణక్రమాలు కూడ పోల్చి చూడాలంటే గత అధ్యాయంలో ఉన్న ఎతేను బొమ్మతో ఇక్కడ ఉన్న ఎతిలీను బొమ్మని సరిపోల్చి చూడండి. వీటి రెండింటిలో కొట్టొచ్చినట్లు కనబడే విషయం ఏమిటంటే ఎతేను లో అన్నీ ఏక బంధాలే, కాని ఇక్కడ ఎతిలీను లో ఒక జంట బంధం (double bond) ఉంది.

ఇదే విషయాన్ని మరొక కోణం గుండా చూద్దాం. ఎతేను లో ఉన్న రెండు కర్బనం అణువులు తమకి ఉన్న ఖాళీ చేతులతో ఆరు ఉదజని అణువులని పట్టుకున్నాయి. అంటే, ఎతేను చేతులన్నీ ఉదజనితో నిండుగా ఉన్నాయి. ఎతిలీను విషయంలో ఇలా జరగలేదు. ఇక్కడా రెండు కర్బనపు అణువులు ఉన్నాయి. కాని ఇవి నాలుగు ఉదజని అణువులని పట్టుకోగా మిగిలిన ఖాళీ చేతులతో పట్టుకోటానికి మరేమీ లేక పక్క నున్న కర్బనపు అణువునే పట్టుకున్నాయి. (చేతులేవీ ఖాళీగా ఉండకూడదనే నిబంధనకి తల ఒగ్గుతూ.) ఈ పరిస్థితిని మనం ఒక విధంగా ఉపయోగించుకోవచ్చు. ఎతిలీను లో ఉన్న కర్బనం అణువులు మధ్య ఉన్న జట్టాపట్టాలని విడగొట్టగా వచ్చిన ఖాళీ చేతులలో ఒక జతని ఒకరినొకరు పట్టుకోటానికి వాడి, మిగిలిన రెండు ఖాళీ చేతులకీ చెరొక ఉదజని అణువుని తగిలించవచ్చు.

ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్పవచ్చు. ఎతేను సంతుష్టిగా భోజనం చేసిన వ్యక్తి వంటిది. దానికి ఇహ “ఉదజని అణువులని తినటానికి” చేతులు ఖాళీగా లేవు. అందుకని ఎతేను ని "సంతుష్ట ఉదకర్బనం" (saturated hydrocarbon) అంటారు. ఈ ఉపమానం ప్రకారం ఎతిలీను కి మరో రెండు ఉదజని అణువులని మొయ్యగలిగే (లేదా "తినగలిగే") స్థోమత ఉంది. అందువల్ల జంట బంధాలు, త్రిపుట బంధాలు (బహు బంధాలు) ఉన్న ఉదకర్బనాలని అసంతృప్త ఉదకర్బనాలు (unsaturated hydrocarbons) అంటారు. అసంతృప్త ఉదకర్బనాల గుండా ఉదజని వాయువుని పంపి వాటిని సంతృప్తి పరచటాన్ని ఉదజనీకరణ (hydrogenation) అంటారు.

పైన ఉదహరించిన ఉదజనీకరణ అనే ప్రక్రియ మరీ మనకి తెలియనిది కాదు. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె, పత్తి నూనె, సూర్యకాంతపు నూనె (sunflower oil) మొదలైన నూనెల గుండా ఉదజని వాయువుని పంపితే ఆ నూనె కాస్తా వనస్పతి అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల నూనెలలో ఉన్న అసంతృప్త గోరోజనామ్లాలు (fatty acids) సంతృప్త గోరోజనామ్లాలుగా మారతాయి. ఇలా మారినప్పుడు గది ఉష్ణోగ్రత దగ్గర ద్రవ రూపంలో ఉన్న నూనెలు వెన్నలా ఘన రూపంలోకి మారతాయి. ఇలా ఘన రూపంలో ఉన్న కొవ్వు పదార్ధాలని నిల్వ చెయ్యటం తేలిక, రవాణా చెయ్యటం తేలిక. అంతే కాదు. కొన్ని రకాల వంటలకి ఘన రూపంలో ఉన్న కొవ్వులని వాడితేనే అవి గుల్లబారి, విచ్చుకుని, తినటానికి బాగుంటాయి. మరొక వ్యాపార రహశ్యం ఏమిటంటే ముడి పదార్ధాలుగా ఏ చవకబారు నూనెని వాడినా వనస్పతీకరణ అయిన తరువాత తేడాని పోల్తి పట్టలేము. అందుకనే వనస్పతులని తయారు చెయ్యటానికి చవక రకం నూనెలని వాడటం సర్వసాధారణంగా జరుగుతుంది. భారత దేశంలో మనకి చిరపరిచితమయిన వనస్పతి వ్యాపారనామం డాల్డా. అమెరికాలో ఈ వనస్పతులని మార్జరీన్ (margarine) అనిన్నీ షార్టెనింగ్ (shortening) అనిన్నీ అంటారు.

వనస్పతీకరణ వల్ల ఆరోగ్యానికి (ప్రత్యేకించి గుండె ఆరోగ్యానికి) ఏమైనా నష్టం ఉందేమోనని ఈ మధ్య కొందరు అనుమాన పడుతున్నారు. వనస్పతీకరణ ద్వారా కొవ్వు పదార్ధాల సహజ లక్షణాలని కృత్రిమంగా మార్చటం వల్ల ట్రాన్స్ ఫేట్స్ (trans fats) అనే కొవ్వులు తయారవుతున్నాయనిన్నీ ఈ ట్రాన్స్ ఫేట్స్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదనిన్నీ కొందరు వైద్యులు ఆరాట పడుతున్నారు. ఈ ఆరోగ్య సంబంధమైన విషయాలన్నీ కూలంకషంగా చర్చించటానికి ఇది అనువైన సమయమూ కాదు, స్థలమూ కాదు.

దండించబడ్డ ఉదకర్బనాలు, పోలీతేను సంచులు

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే బహుబంధాలున్న ఉదకర్బనాలు ఉమ్మడి కుటుంబాలలాంటివి. ఉమ్మడి కుటుంబాలలో ఉన్న సంసారాలకి ఎలా మశ్శాంతి ఉండదో అలాగే బహుబంధాలు ఉన్న బణువులకి "మనశ్శాంతి" ఉండదు. ఉమ్మడి కుటుంబాలలో ఉన్న సభ్యుల మధ్య కలతలు పెట్టి విడగొట్టటం ఎంత తేలికో అలాగే బహుబంధాలు ఉన్న బణువుల మధ్య బంధాలని విడగొట్టటం తేలిక.

మరొక కోణం గుండా చెప్పాలంటే బహుబంధాలు ఉన్న బణువులకి నిశ్చలత (stability) తక్కువ. అంటే చురుకుదనం ఎక్కువ. రెండు బంధాలు కన్న మూడు బంధాలు ఉన్న బణువులకి ఈ చురుకుదనం ఇంకా ఎక్కువ. ఈ చురుకుదనాన్ని మన ఉపయోగాలకి ఎలా వినియోగించుకోవచ్చో చెబుతాను.

ఉదాహరణకి ఎతిలీనుని గట్టిగా మూత ఉన్న గిన్నెలో వేసి వేడి చేస్తే ఆ వేడికి ఈ బణువుల చైతన్యం పెరుగుతుంది. మూత ఉన్నది కనుక బయటకి పోలేవు. చైతన్యం ఉంది కనుక వాటిలో అవే ఢీకొట్టుకుంటూ ఉంటాయి. అప్పుడు కొన్ని జంత బంధాలు తెగిపోయి పక్కనున్న బణువులతో కలిసి ఇంకా పెద్ద బణువులుగా తయారవుతాయి. 9గతంలో ఒక సారి ఉదకర్బనాలని గొలుసులతో పోల్చేము కదా.) కనుక చిన్న చిన్న గొలుసులుగా ఉన్న ఎతిలీను బణువులు బాగా పొడుగాటి బణువులుగా మారతాయన్నమాట. ఈ పొడుగాటి గొలుసులలో ఒకొక్క లంకె (link) ఒకొక్క ఎతిలీను బణువు అన్నమాట. గొలుసులో "ఎన్నో" ఎతిలీను బణువులు ఉన్నాయన్నమాట. ఈ "ఎన్నో" లేదా "చాలా" అన్న విశేషణం గ్రీకు భాషలో "పోలీ" కి సరితూగుతుంది. ఇదే ఇంగ్లీషులో poly అన్న మాటకి మూలం. "పోలీటెక్నిక్" లో "పోలీ" అర్ధం కూడా ఇదే. ఎన్నో "టెక్నిక్కులు" నేర్పే పాఠశాలని "పోలీటెక్నిక్ కాలేజీ" అంటాం. అదే విధంగా ఎన్నో ఎతిలీను లంకెలు ఉన్న గొలుసుని ఏమంటాం? "పోలీ ఎతిలీను". అందాకా దీనిని మనం "బహు ఎతిలీను" అందాం - సరదాకి.

సగం తెలుగు, సగం ఇంగ్లీషుతో దుష్టసంధి చేస్తూ "బహు ఎతిలీను" ఏమిటని మీరు కోపగించుకోకండి. కర్బన రసాయనశాస్త్రం ఇంకా శైసవావస్థలో ఉన్నప్పుడు, ఇప్పటిలా అప్పుడు వార్తా సౌకర్యాలు గట్రా లేవు గనుక, రసాయనాలకి ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు పెట్టెస్తూ ఉండేవారు - ఇప్పుడు నేను బహు ఎతిలీను అని పెట్టినట్లు. ఈ వేలం వెర్రిలో రసాయనశాస్త్రం రసాభాసు అయినంత పని అయింది. అప్పుడు, అంటే సా. శ. 1892 లో, పెద్దలంతా జినీవా, స్విట్జర్లండులో సమావేశమయి ఒక ఒప్పందానికి వచ్చేరు. సంతృప్త ఉదకర్బనాల పేర్లు అన్నీ "-ఏను" (-ane) శబ్దంతో అంతం అవాలనీ, జంట బంధాలున్న ఉదకర్బనాలన్నీ "-ఈను" (-ene) శబ్దంతో అంతం అవాలనీ, త్రిపుట బంధాలున్న ఉదకర్బనాలన్నీ "-ఐను" (-yne) శబ్దంతో అంతం అవాలనీ ఈ ఒప్పందం యొక్క సారాంశం. "ఒప్పందాలన్నీ ఉల్లంఘించటానికే" అనే నానుడి ఇక్కడా నిజం అయింది. కొత్తగా కనిబెట్టబడ్డ పదార్ధాలకి ఈ ఒప్పందం ప్రకారం పేర్లు పెట్టటం మొదలు పెట్టేరు, అవి అతుక్కున్నాయి కూడా. కాని అప్పటికే స్థిరపడిపోయిన పాత పేర్లని అలవాటుపడ్డ ప్రాణాలు మార్చలేకపోయాయి.

ఏది ఏమైతేనేమి, మెతేను, ఎతేను, బ్యుటేను అన్న పాత పేర్లు ఈ ఒప్పందానికి అనుకూలంగానే ఉన్నాయి కనుక ఇబ్బంది లేకపోయింది. కాని జంటబంధం ఉన్న "ఎతిలీను" అన్న పేరు ఈ జినీవా ఒప్పందానికి విరుద్ధంగా ఉంది. అందుకని ఈ పేరుని "ఎతీను" అని మార్చమని పెద్దలంతా సెలవిచ్చేరు. విన్నవాళ్ళు విన్నారు. మొండికేసిన ఘటాలు మొండికేసేయి. ఇంత రాద్ధాంతం చేసిన తరువాత పాఠకలోకాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు. అందుకని పాత పేర్లనీ, కొత్త పేర్లనీ ఇక్కడ ఒక సారి పరామర్శ చేద్దాం.

పాత పేరు: ఎతేను (ethane)
కొత్త పేరు: ఎతేను (ethane)
సాంఖ్య క్రమం: C2H6
నిర్మాణ క్రమం: H3C-CH3

పాత పేరు: ఎతిలీను (ethylene)
కొత్త పేరు: ఎతీను (ethene)
సాంఖ్య క్రమం: C2H4
నిర్మాణ క్రమం: H2C=CH2

పాత పేరు: ఎసిటిలీను (acetylene)
కొత్త పేరు: ఎతైను (ethyne)
సాంఖ్య క్రమం: C2H2
నిర్మాణ క్రమం:

దుష్టసంధి చెయ్యవచ్చా కూడదా అని మీమాంస పడుతూ పెడదారి పట్టేం. ఇదంతా ఎందుకు ఏకరువు పెడుతున్నానంటే ఇంగ్లీషులో పేర్లు పెట్టటం కూడ ఏమీ తేలిక పని కాదు. ఇలా ప్రయాస పడితే పేర్లు పెట్టటం సంగతి అటుంచి పాఠ్యాంశం కొంచెం బాగా అర్ధం అవుతుంది కదా. కనుక అప్పుడప్పుడు ప్రయోగం పేరిట కొత్త కొత్త పేర్లు పెడుతూ ఉంటాను. పక్కన ఇంగ్లీషు పేరు ఎలాగూ ఉంటూ ఉంటుంది కనుక తెలుగు వారికి అర్ధం అవటంలో ఇబ్బంది ఉండదు.

ఇప్పుడు ఎతిలీను కి తెలుగు పేరు పెడదాం - కేవలం సరదాకి మాత్రమే సుమా! పాడ్యమి, విదియ అన్న తిధులని గుర్తు చేసుకుంటూ మెతేనుకి పాడేను అనీ, ఎతేనుని విదేను అనీ గతంలో ఒకసారి ప్రయోగించి చూశాం. ఈ లెక్కన జంట బంధాలు ఉన్న ఎతిలీను (లేదా, కొత్త పేరు, ఎతీను) విదిలీను (లేదా, విదీను) అవుతుంది. ఇప్పుడు "పోలీఎతిలీను" అన్నది "బహువిదిలీను" అవుతుంది. పోలీఎతిలీను కి బదులు కొత్త పేరు పోలీఎతీను వాడితే దానితో సరితూగే తెలుగు పేరు బహువిదీను. పోలీఎతిలీను అన్నా పోలీతేను అన్నా ఒకటే. ఈ రెండింటిని మనం "బహువిదీను" అని కొత్త పేరుతోటే పిలుద్దాం.

ఈ బహువిదీను (లేదా పోలీతేను) బణువు మైనం (wax) బణువుని పోలి ఉంటుంది. కాని మైనం బణువు కంటె బహువిదీను బణువుల పొడుగు చాల ఎక్కువ. మైనం లాగే ఇది కూడా దేనితోటీ రసాయన సంయోగం చెందదు. ఈ పదార్ధం మసక తెలుపు (cloudy white) రంగులో ఉండి, తాకితే జారుగా ఉంటుంది. కాని మైనం కి ఉన్న పెళుసుదనం ఉండదు. ఒంచితే ఒంగుతుంది. సాగదీస్తే సాగుతుంది. పల్చటి పొరలులా చేయనిస్తుంది. మైనం చేతి వేడికి కరుగుతుంది కాని ఇది అలా కరిగిపోదు. ఈ బహువిదీను వేడినీళ్ళల్లో వేస్తే మెత్తబడుతుంది. వేడినీళ్ళల్లో వేసి, మెత్తబరచిన తరువాత మనకి కావలసిన రీతిలో ఒంచ వచ్చు. ఇలా కుమ్మరిమట్టిలా ఎలా పెడితే అలా ఒంగే లక్షణం ఉన్న పదార్ధాలన్నిటిని గుత్తగుచ్చి ప్లేస్టిక్ (plastic) పదార్ధాలు అంటారు. కనుక పోలీతేను (లేదా బహువిదీను) ప్లేస్టిక్ జాతికి చెందిన పదార్ధం అన్నమ్నాట. కుమ్మరిమట్టి కూడా ఒక విధంగా ప్లేస్టిక్ జాతి పదార్ధమే. “ప్లేస్టిక్” అనే మాట నామవాచకం రూపంలో తెలుగువారింట ముద్దల కోడలై కూర్చుంది. నామవాచకం రూపంలో ఈ మాట తెలుగులో ఇమిడిపోయినా విశేషణం రూపంలో ఇమడలేదు. కనుక మనకి ఈ మాటతో సరితూగే దేశవాళీ మాట ఒకటి కావాలి. ఆలోచించండి!

ఎతీనుతో మొదలుపెట్టి పోలీతేను చేసినట్టే, అనేక రకాల బణువులని దండలుగా గుచ్చి “బహుబణువులు” చెయ్యవచ్చు. మచ్చుకి, స్టైరీను (styrene) బణువులు ఉన్నాయి. వీటిని దండలుగా గుచ్చితే వచ్చే పదార్ధం పేరు – చెప్పుకోండి, చూద్దాం? ఆహః. పోలీస్టైరీను. అలాగని మన కంటికి కనిపించిన పదార్ధాలన్నిటిని ఇలా దండలులా గుచ్చలేము. కాని దండలుగా గుచ్చగలిగే సందర్భాలలో ఈ పద్దతిని పొలిమరైజేషన్ అంటారు. పోలిమర్ అంటే బహుభాగి. కనుక polymerization అంటే “బహుభాగించటం”, బహుభాగిగా చెయ్యటం, లేదా దండలా గుచ్చటం, లేదా దండించటం. ఈ మాటలన్నిటిలోకీ “దండించటం” అన్న మాట నాకు నచ్చింది. కనుక “దండించుట” అన్నది “పొలిమైరైజేషన్” కి పర్యాయపదంగా వాడుదాం. ఇప్పుడు పోలీతేను దండించబడ్డ ఎతేను.

ఇలా దండించబడ్డ పోలీతేనుతో చేసిన సంచులు ఇప్పుడు విరివిగా వాడుకలో ఉన్నాయి. ఈ సంచులలో ఏదైనా పోసి మూతిని వేడి చేసి అతికెయ్యవచ్చు. సంచీని విప్పాలంటే కత్తెర తోనో గోళ్ళతోనో చింపెయ్యవచ్చు. ఇలాంటి సంచులే కాకుండా ఈ బహువిదీనుతో రకరకాల రంగుల సంచులు, బుట్టలు, సజ్జలు, డబ్బాలు, మొదలైన గృహోపకరణాలు ఎన్నో చెయ్యవచ్చు. అలాగే పోలీస్టైరీనుకి కూడ రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. గురివింజగింజ చూట్టానికి ఎంత ఎర్రగా, బుర్రగా ఉన్నా దాని వెనక ఒక నలుపు మచ్చ ఉన్నట్లే ఈ దండించబడ్డ ఉదకర్బనాలతో తయారయే గృహోపకరణాల వాడుకలో ఒక వెలితి ఉంది. పోలీతేను సంచులనే తీసుకుందాం. వీటిని ఒకసారి వాడిన తరువాత చెత్తలో పారేస్తాం. కాని ఈ సంచుల తయారీలో వాడిన రసాయనం దేనితోనూ సంయోగం చెందదు (అందుకనే మనం ఇళ్ళల్లో వాడటానికి భయపడం కూడ). కొన్నాళ్ళకి ఈ చెత్త పేరుకుపోతుంది; గోనె సంచుల మాదిరి చివికి, శిధిలమై, మట్టిలో కలిసిపోదు. దీని పర్యవసానం పర్యావరణ కాలుష్యం. సంధాన రసాయనాలని విశృంఖలంగా వాడటం అంత శ్రేయోదాయకం కాదేమో! ఇది ఆలోచించవలసిన విషయం.

కృతజ్ఞత: ఈ వ్యాసంలో బొమ్మలు వేసినది ప్రసాదం,
బ్లాగే స్థలం: http://prasadm.wordpress.com/
నేను బ్లాగే మరో స్థలం: http://latebloomer-usa.blogspot.com