Sunday, June 26, 2016

బిగ్ డేటా అంటే ఏమిటి? ఎందుకీ హడావిడి?


మనం మన చేత్తో చేసుకోగలిగే పనులు చిన్న పనులు: ఇంట్లో వంట వండుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, వగైరాలు. మన శక్తికి మించిన పని ఎదురైతే అది భారీ పని అని చెప్పి పని మనుష్యులకి పురమాయించి చేయించుకుంటాం. ఇంకా పెద్ద పని అయితే కంట్రాక్టరుకి ఇస్తాం. అదే విధంగా మన కంప్యూటరు చెయ్యగలిగే పనులన్నీ చిన్న పనులే. మన కంప్యూటరులో పట్టనంత పెద్ద పని అయినా, మన కంప్యూటరు స్థోమతకి మించి ఎక్కువ జోరుగా పని చెయ్యవలసినా దానిని భారీ పని అంటాం. ఇంగ్లీషులో  ఈ రకం భారీతనాన్ని “బిగ్ డేటా” అనే విశేషణంతో సూచిస్తారు. 

బిగ్ డేటా అనేది సాపేక్ష భావం. పూర్వం, అనగా 1980 దశకంలో, నేను పని చేసిన. కంపెనీలో వాడే కంప్యూటరులో ప్రాథమిక కోష్ఠం (RAM) 4 మిలియన్ల బైట్లు (4 MB), ద్వితీయ శ్రేణి కోష్ఠం (hard disk) 400 మిలియను బైట్లు (400 MB) ఉండేవి. ఒక దశాబ్దం గడిచి 1990 లో నా బల్ల మీద ఉన్న కంప్యూటరులో ప్రాథమిక కోష్ఠం (RAM) 64 మిలియన్ల బైట్లు (64 MB), ద్వితీయ శ్రేణి కోష్ఠం (hard disk) 2 బిలియను బైట్లు (2 GB) ఉండేవి. మరొక రెండు దశాబ్దాలు గడచిన తరువాత, 2015 లో, నా బల్ల మీద ఉన్న కంప్యూటరులో ప్రాథమిక కోష్ఠం (RAM) 4 బిలియన్ల బైట్లు (4 GB), ద్వితీయ శ్రేణి కోష్ఠం (HD) 1 ట్రిలియను బైట్లు (1 TB) ఉంటున్నాయి. అంటే పూర్వం “భారీ డేటా” అనుకున్నదే  ఈ నాడు సీదా, సాదా  అయిపోయింది!

ఇప్పుడు G-mail, Facebook, మొదలైన అనువర్తనాలు విస్తారంగా వాడుకలోకి వచ్చిన తరువాత ఈ దత్తాంశ ప్రవాహం వెల్లువ అయి మనని ముంచెస్తున్నాది. రోజు రోజుకీ పాపం పెరిగినట్లు ఈ దత్తాంశ ప్రవాహం పెరుగుతొంది తప్ప ఆగటం లేదు. మనం మన కంప్యూటర్ల స్థోమతని ఎంతకని పెంచగలం? అందుకని పెనుభూతంలా పెరిగిపోతూన్న ఈ ప్రవాహాన్ని వాడుకోడానికి మనకి కొత్త రకం పరికరాలు కావాలి, పాత పరికరాలకి పదును పట్టాలి. ఇదే “బిగ్ డేటా” అంటూ చేస్తూన్న హడావిడి.

2 comments:

  1. భారీ దత్తం గురించి ఎంత సరళంగా చెప్పారు, సర్!

    ధన్యవాదాలు,
    ~ లలిత

    ReplyDelete
  2. కోష్ఠమేమిటి కాష్టంలాగా? ఇది మీకుతప్ప ఇంకెవరికి అర్ధమవుతుంది? అసలిందులో అర్ధమవ్వాల్సిందేముంది? భారీ దత్తమా? అదేదో ఏనుగు పేరులా ఉంది.

    మీకు చేతనైతే హడూప్ గురించి రాయొచ్చుగా?

    ReplyDelete