Thursday, May 18, 2017

తెలుగులో కొత్త మాటలు

మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. అలాగని టోకు బేరంలా, పెద్ద ఎత్తున, ఇంగ్లీషులోని మాటలని తెలుగులోకి దింపేసుకుంటే అవి మన నుడికారానికి నప్పవు. కనుక మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని ఎవరు చేస్తారు? మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో ఘటోత్కచుడు చెప్పినట్లు మాటలు మనం పట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?
భాష వాడుకకి కమిటీలు అక్కర లేదు. మన అవసరానికి అనుకూలంగా ఒక ఇంగ్లీషు మాటకి సరి అయిన తెలుగు మాట లేదని తెలియగానే అదే సందర్భంలో ఇంగ్లీషు రాని తెలుగు వ్యక్తి ఏమి చేస్తాడని అలోచించండి. అప్పుడు తెలుగు మాట మీ బుర్రకే తడుతుంది. మీ బుర్రకి తట్టిన మాట అందరూ సమ్మతిస్తారా అని ఆవేదన పడకండి; అలాగని మీ మాట మీద విపరీతంగా మమకారం పెంచేసుకోకండి. ప్రయోగించి చూడండి. అది పలకక పోతే మరో సందర్భంలో మరో మాట స్ఫురిస్తుంది. తగిన మాట ఏదీ స్ఫురించకపోతే ఇంగ్లీషు మాట ఉండనే ఉంది.
మరొక విషయం. ఎప్పుడూ ఇంగ్లీషు మాటలనే ఎరువు తెచ్చుకుని వాడాలని నియమం ఏముంది? మనకి అనేక భాషలతో సంపర్కం ఉంది కనుక అన్నింటిని సమదృష్టితో చూసి నాలుగు భాషల నుండీ స్వీకరిస్తే భాష మరీ ఇంగ్లీషు వాసన వెయ్యకుండా ఉంటుంది. ఆలోచించండి. ప్రయత్నించండి.